సుమతి శతకం వివేకవంతం

శతక సాహిత్యం అతి ప్రాచీనమైంది. మానవ జీవనం సన్మార్గంలో సాగిపోయేలా మార్గదర్శనం చేస్తుంది. సమాజ తీరుతెన్నులను అవగతమయ్యేలా విడమరచి బోధిస్తుంది. మంచి చెడ్డలను విశ్లేషించి చూపుతుంది. వేమన, బద్దెన రాసిన శతకాలు ఏళ్లు గడుస్తున్నకొద్దీ వన్నె తరగని నిధులు. వాటిలో 13వ శతాబ్దికి చెందిన బద్దెన రచించిన ‘సుమతి శతకం’ నిత్య జీవితానికి సరిపోయే సూక్తులను ఎన్నింటినో తనలో పొదుగుకుంది. సుమతి శతక సూక్తులకు సొంత వ్యాఖ్యానంతోపాటు వివేకానందుని అమృతవాక్యులుకూడా జోడిస్తున్నాను. సుమతి శతకకర్త బద్దెన తాను ‘శ్రీరాముని దయచేతనే…’ ఈ శతకం చెబుతున్నాను అన్నారు. చదివేవాడు బుద్ధిమంతుడు అయితేనే, ఇవి రుచిస్తాయి అన్నారు. కనుక సుబుద్ధితో ఆ రుచి మాధుర్యాన్ని చవిచూద్దాం.


‘తనవారు లేని చోటను
జనువిన్చుక లేనిచోట జగడము చోటన్‌
అనుమానమైన చోటను
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతి||

తనవారు లేని చోట, ,చనువు లేని చోట, కలహించే చోట, అవమానమైన చోట, అనువుగాని చోట ఉండదగదు. అనవసరమైన వాదులాటకు చోటు ఇవ్వడమే కీడు. అట్టి వాదోపవాదాలకు దిగకుండా ఉండడమే నేర్పరితనం.

ఎప్పటికెయ్యది ప్రస్తుత 
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌
నొప్పింపక తానొవ్వక
తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి||

‘మన చుట్టూ ఉండే సమాజంలో రకరకాలవారు, భిన్న మనస్తత్వాలవారు ఉంటారు. ఎవరినీ నొప్పించకుండా సమయోచిత మాటలతో వివేకవంతుడు తన కార్యాలు చక్కదిద్దుకుంటాడు. అలాగే వివాదాల్లోకి చొరబడి అనవసర మానసిక ఖేదానికి గురికాకుండా తప్పించుతిరగాలి’ అని సుమతి శతకం చెబుతోంది.

ఒక్క మాటలో స్వామి వివేకానంద ఇలా అంటారు. ‘వ్యర్ధ వాగ్వాదంచేత ఎవరైనా మీ వద్దకు వస్తే సమస్త మర్యాదలతో నీవు వత్తిగిల్లి, అతని విచారం, సానుభూతి, వినయం ప్రకటించి తప్పుకొనుము’. ఇది ఉత్తముల లక్షణం అంటారు వివేకానందులు.

మనం ఎప్పుడూ వ్యర్ధ వాగ్వాదాలకు దిగుతుంటాం. రాజకీయాల గురించి, అభిమాన నటీనటుల గురించి, కుల మతపరమైన అంశాలగురించి అనవసరపు వాదులాటలకు దిగుతాం. దీనివల్ల సమయ వృధా ఒక్కటేగాక, కంఠశోష, మానసిక ఆందోళనకూడా సంక్రమిస్తాయి. నేను చెప్పిందే సరైనది. మా నాయకుడు చెప్పిందే వేదం అనడంతో మొదలయ్యే వాదనలు చినికి చినికి గాలివానయిన చందంగా అసభ్య పదజాలానికి మారుతుంది. ఒక్కోసారి కొట్లాటకు దారితీస్తుంది. పరనింద, ఆత్మస్తుతి అనేవి మనలోని వికృత రూపాలు. సద్విమర్శను భరించలేని స్థితిలో మనం ఉన్నామనడానికి నిదర్శనాలు. 

అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వర వరమీని వేల్పు
మోహరమున దా నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి||

ఆపదలో అవసరానికి తోడ్పడని బంధువు, ఎంత వేడుకున్నా దయతలచి వరమివ్వని దైవం, యుద్ధంలో చురుకుగా పరుగెత్తని గుఱ్ఱం వ్యర్ధం. వీటిని వెంటనే వదిలించుకుంటేనే తదుపరి ఆలోచన సాగుతుందన్నది శతకకారుడి భావం.

ఆధారము కడలియు గదలక
మధురములగు బాసలుడిగి మౌన వ్రతుడూ
నధికార రోగ పూరిత బధిరాంధక
శవము జూడ బాపము సుమతి||

అధికారమనేది సకల దుర్గుణాలతోపాటు రోగాలనుకూడా సంక్రమింపజేసే మహమ్మారి. అధికారం దక్కినవాడికి ఆర్తజనుల రోదన వినపడదు. వాస్తవాలు చూడగలిగే దృష్టి లోపిస్తుంది. నోరు ఉన్నప్పటికీ హితవుకూర్చే వాగ్దానాలు చేయలేక మూగతనం ప్రాప్తిస్తుంది. అలాంటివాడు శవంతో సమానం. అధికారం జీవచ్ఛవంలా మారుస్తుందని, అట్టివాడిని చూడడం పాపం అని సుమతి సూక్తి.

ఉపమింప మొదట తియ్యన
కపటం బెడనెడను జేరకు కైవడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి||

చెడ్డవారితో స్నేహం మొదట చాలా తియ్యగా, కమ్మగా ఉంటుంది. పోను పోనూ వారిలోని దుర్లక్షణాలు బయటపడుతుంటాయి. చివరకు వారిని భరించలేని స్థితికి చేరుకుంటాం. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరమే మేలు కాబట్టి, స్నేహితులను ఎంచుకునేటప్పుడు వారి వారి గుణ విశేషాలు తెలుసుకోమని బోధిస్తుంది.
ఓడల బండ్లును వచ్చును
ఓడలు నా బండ్లమీద నొప్పుగా వచ్చున్‌
ఓడలు బండ్లును వలెనే
వాడంబడు కలిమి లేమి వసుధను సుమతి||

ఓడలు, బండ్లు అనేవి కలిమి లేములకు సంకేతాలు. ఓడలలో బండ్లు రవాణా అవుతుంటాయి. అవే ఓడలను సముద్ర ప్రవేశానికి ముందుగా బండ్లపైన తరలిస్తుంటారు. పరస్పర ఆధారసహితంగా సాగే ఈ ప్రయాణం వలెనే మానవ జీవనంలోనూ కలిమి లేములు జమిలిగా ఉంటాయి. కలిమి ఉన్ననాడు పొంగిపోక, లేమినాడు కుంగిపోక స్థిరచిత్తంతో కొనసాగమని చెబుతున్నాడు శతకకర్త.

వివేకానందులు ఇలా చెబుతారు..’సుఖ దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. సుఖాన్ని ఆహ్వానించేవాడు దుఃఖాన్ని తట్టుకోవడానికి కూడా సిద్ధపడాలి. సుఖం దుఃఖమనే కిరీటాన్ని ధరించి వస్తుంది’. స్వామి ఏమి చెప్పినా సూటిగా సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతారు.

ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా నాకో సంగతి గుర్తుకొస్తుంది. ప్రతి ఒక్కరూ ఆస్తిపరులం కావాలనుకుంటారు. ఆస్తి పెరుగుతున్నకొద్దీ శత్రువులు పెరుగుతారు. వారు ఎక్కడినుంచో దిగుమతి కారు. బంధు మిత్రుల రూపంలోనే తారసపడతారు. అలాగే ఆస్తి ఇబ్బడిముబ్బడిగా పెంచుకుని సుఖపడదామనుకున్న తరుణంలోనే పన్నుల బాధ వెన్నాడుతుంది. కష్టార్జితాన్ని పన్నుల రూపంలో చెల్లించడమంటే చాలా దుఃఖం కమ్ము కొస్తుంది. జీవిత కాలమంతా ఆస్తి పోగేయడంలోనే గడిపి చరమదశ చేరుకునేసరికి శరీరం పలు రోగాలకు నెలవు అవుతుంది. ఆస్తి అనే సుఖంతోపాటే శత్రుభయం, పన్నుల సమస్య, రోగాలు వంటి దుఃఖాలుకూడా వెన్నంటి వస్తుంటాయి.

‘గీత’లో సుఖం, సంతోషం, ఆనందం, ఆహ్లాదాలకు ఎలా నిర్వచనంఉన్నదో గమనించండి. ‘జీవిత సమరం నుంచి, సమస్యలనుండి పారిపోవడానికి ప్రయత్నిస్తావు. ఎందుకు? అది మన అమాయకత్వం. వాటిని తప్పించు కోలేము’.
నిజంగా జీవితం అంటే అవే! వాటిని ఎదుర్కొనడమే సుఖం. వాటిని పరిష్కరించడంలోనే సంతోషం. జీవితంలోని ఒడిదొడుకులను క్రీడలా ఆనందించడమే జీవితానికి ఆహ్లాదాన్నిస్తుంది.

కరణం సాదై యున్నను
గరిమదముడిగినను బాము గర్వక యున్నన్‌
ధర దేలు మీటకున్నను
గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతి||

మంచితనానికికూడా ఒక హద్దుండాలి. మెతకతనం ఎల్లవేళలా పనికి రాదు. సమయాన్నిబట్టి, అవసరాన్నిబట్టి, ఎదురైన ఆపదనుబట్టి మసలుకోవాలి. అవసరమైన కరకుతనాన్ని చూపాలి. ఏనుగుకు మదం తగ్గిపోయినా, పాముకు బుసకొట్టకపోయినా, తేలు కుట్టకపోయినా జనం పట్టించుకోరు. రాళ్లతో కొట్టి చంపేస్తారు. కరవకపోయినా బుస కొట్టడంవల్ల జనులలో భయమనేది ఉంటుంది.

స్వామి వివేకానందులు…’చేతకానివాడినంటూ ఊరకే విలపించడమెందుకు? చింతించడమేల? లెమ్ము మేల్కొనుము. నీవు దుర్మార్గుడవగుట విధి అయితే, దుర్మార్గుడవు కమ్ము. నువ్వు నంగనాచివలె ఉండడంకంటే దుర్మార్గుడవై ఉన్నప్పుడు ‘నేను బలవంతుడను’ అని అనుకొన్నప్పుడు… నువ్వు మరలా సన్మార్గంలోనికి రాగల సాహసం చేయగలవు’ అని ఉద్బోధిస్తారు.

తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమంద్రు తధ్యము సుమతి||

కోపాన్ని అణచుకోలేనిపక్షంలో శత్రువులను పెంచుకుంటాం. శాంతంగా ఉండగలిగితే చుట్టూ సుహృద్భావ వాతావరణం పెరుగుతుంది. అదే మనకు రక్షణనిస్తుంది. దయను ప్రసాదిస్తుంది. చుట్టంలా సేదతీరుస్తుంది. ఎల్లప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అంతకుమించిన స్వర్గం మరొకటి ఉండదు. అలాకాకుండా నిత్యం దుఃఖంలో మునిగితేలితే బతుకు నరకప్రాయంగా మారుతుంది.

-గోపి చిల్లకూరు, డల్లాస్‌, అమెరికా –  askgopi123@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *