వివేక వాదం – ప్రభాత భారత గీతం

వెలుగుకు మారుపేరైన దేశం చిమ్మచీకట్లో ఉన్నప్పుడు చిరుదివ్వెలా…
బానిస భారతం సంకెళ్లు తెగదెంచే సమ్మెటలా…
మూఢాచారమే మతంగా, వివక్షే కులంగా వికటించిన కాలంలో వేదాంత విప్లవమూర్తిలా…
తెల్లతోలువాడు ఏమి చెప్పినా అదే విజ్ఞానంగా భావించే బానిస యుగంలో స్వాభిమానపు, ఆత్మవిశ్వాసపు అద్భుత రూపంగా…
స్తబ్దుగా పడున్న సమాజానికి వేకువ వార్త చెప్పే వైతాళికుడిలా…
భారతీయుల బద్దకాన్ని భగ్నంచేసే భగవద్దూతగా…
పరాక్రమ భారతపు ప్రభాత గీతంగా…
దైర్బల్యానికి వైరిగా, వేదాంతపు భేరీగా వచ్చాడు వివేకానందుడు.
ఆయన కళ్లు వర్గమానాన్ని ఛేదించి భవిష్యత్తును చూశాయి. భావి భారతాన్ని, బంగారు భారతాన్ని చూశాయి.
ఆయన మనోనేత్రాలు విశ్వవీధిలో విజయ దరహాసంతో సగర్వంగా… సగైరవంగా భారతీయుడు నిలిచి, గెలిచే రోజును స్వప్నించాయి.
ప్రాచ్యపు ఆధ్యాత్మికత లోతులను, పాశ్చాత్యపు ఆధునికత ఎత్తులను సమన్వయ పరిచి భారతీయాత్మ విశ్వాత్మగా ఎదిగే అద్భుత ఘడియలు ఆయన హృదయ సీమలో బంగారుపంటలై పండాయి.
అందుకే ఇన్నేళ్లు గడిచినా స్వామి వివేకానందుడిని ఈ జాతి కొలుస్తూనే ఉంది. చిర యౌవనపు మేరు శిఖరంగా, కర్తృత్వానికి, నేతృత్వానికి మహా సాగరంలా ఆయనను జాతి ఆరాధిస్తూనే ఉంది. 
‘బలమే జీవనం, భయమే మరణం’
‘నిర్భీతియే వేదాంత సారం’
‘లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకు’
‘నీలో ఉన్న దైవత్వాన్ని మేల్కొలుపు’ అంటూ ఇనుప నరాలు, ఉక్కుకండరాల యువతను ఆవాహన చేసిన వివేకానందుడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ యువతకు ప్రతీకయే.

యువతకు ఆదర్శం
‘ఓ తేజస్వరూపా… జనన మరణాలకు అతీతుడా… మేలుకో… బలహీనతలను తొలగించుకో… పౌరుషాన్ని ప్రసాదించుకో… మనిషిగా మసలుకో…’ ఇదీ భారతీయ యువతకు వివేకానందుడి సందేశం.
వివేకంలోని అనంతానందాన్ని ఆస్వాదించే అపూర్వ మనీషిగా వివేకానందుడు పరిణితిచెందే ముందుకూడా ఆయన నరుల్లో ఇంద్రుడిలాంటి నరేంద్రుడే.
బాల్యంలోనే ఆయనలోని అంతర్గత అనంత శక్తి అల్లరి రూపంలో దర్శనమిచ్చింది. భవిష్యత్తులో సమాజాన్ని ఆవరించిన సమస్యల భూతాలను చూసి జంకని, గుంకని వీరసన్యాసిగా వివేకానందుడు నిలుస్తాడన్న సత్యాన్ని దయ్యాలు, భూతాలంటే బాల్యంనుంచే భయపడని బాలనరేంద్రుడు చెప్పాడు. తార్కికుడిగా, నిర్భయ పథికుడిగా ఆయన కౌమార్యం గడిచింది. దేవుడిని చూడాలన్న ఆయన తపనే ఆయనను దక్షిణేశ్వర్‌లో ఒక ఉసిరి చెట్టుకింద మాసిన గడ్డంతో, చిన్న అంగవస్త్రమే ఆచ్ఛాదనగా, అర్ధనిమీలిత నేత్రాలతో, దివ్యోన్మాదంతో ధ్యానముద్రలో ఉన్న రామకృష్ణ పరమహంస దగ్గరకు తీసుకెళ్లింది. నరేంద్రుడిని చూడగానే రామకృష్ణుడు ‘వచ్చావా… నీకోసం ఎన్నాళ్లుగానో చూస్తున్నాను… ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు వచ్చావా?’ అన్నాడు పరమానందంతో. 

రామకృష్ణుడి కోరిక మేరకు నరేంద్రుడు ‘చలో మన నిజ నికేతన్‌’ అన్న భజన గీతాన్ని ఆలపించాడు. అలా నరేంద్రుడు తన నిజ నికేతనానికి (సొంత గూటికి) చేరుకున్నాడు. రామకృష్ణ పరమహంసను తనకు దేవుడిని చూపించమన్నాడు. ‘గదిలో కాళీమాత సాక్షాత్కారమవుతుంది. ఏం కావాలో కోరుకో’ అని రామకృష్ణుడు చెప్పాడు. ఒకటి కాదు.. రెండు కాదు… ముమ్మార్లు అమ్మవారు దర్శనమిచ్చింది. మూడు సార్లూ నరేంద్రుడు ‘జ్ఞాన భక్తి వైరాగ్యాల’నే కోరుకున్నాడు తప్ప ఐహికమైనదేదీ అడగలేదు. ఆ క్షణమే ఆయన నరేంద్రుడన్న ఆవరణను తొలగించుకుని, వివేకానందుడయ్యాడు.

రామకృష్ణులు తన శక్తినంతా వివేకానందునికి ఇచ్చి, కర్తవ్యోపదేశం చేసి ఇహలీలను చాలించారు. ఆ తర్వాత నుంచి రామకృష్ణుని శిష్యులతో కలిసి సాధన, తపస్సు, అధ్యయనం చేస్తూ గడిపారు వివేకానందులు. దేశం నలుమూలలా పర్యటించి చివరికి 1892 డిసెంబర్‌ 25న కన్యాకుమారి చేరుకున్నారు. కన్యాకుమారిలో సముద్రాన్ని ఈదుతూ మధ్యలోని ఒక శిలపై కూర్చుని భారతదేశాన్ని ధ్యానించారు. ఒకవైపు పరమపిత పరమేశ్వరుడు హిమాలయాల నుంచి బాహువులు చాచి, దక్షిణాగ్రంలోని కన్యాకుమారిని ఆలింగనం చేసుకున్నట్టు… యావద్భారతమే ఆ పవిత్ర ఆలింగన ఫలమన్నట్టు కలగన్నారు.

మరుక్షణం.. అంతటి అమేయ ఆధ్యాత్మిక సంపద ఉన్న దేశం… దీన, హీన, దయనీయ స్థితిలో, తనను తాను మరచిన స్థితిలో ఉండడం కనిపించింది. ఈ దేశంకోసం పనిచేయడమే కర్తవ్యమన్న బోధ స్ఫురించింది. అక్కడినుంచి ఆయన అమెరికాలోని సర్వమత సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1893 మే 31న ఓడలో బయలుదేరారు. ఆగస్టు 20న అమెరికా చేరారు. సెప్టెంబర్‌ 11న షికాగో సభలో చరిత్రాత్మక ప్రసంగం చేసి, ప్రపంచ చరిత్రను మార్చేశారు. భారతదేశాన్ని, భారతీయాత్మను కబళించేందుకు కుట్రపన్నుతున్న మిషనరీల బండారాన్ని బట్టబయలు చేయడమేకాక, హిందువుల సమన్వయవాణిని, మన వేదాంత వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. విశ్వవీధిలో వివేకానంద విజయ వైజయంతి బారతీయ యువతను విద్యుచ్ఛకితం చేసింది. పరాభవ, పరాజయాల యుగం నుంచి ప్రాభవ, పరాక్రమాల యుగంలోని యువత అడుగుమోపింది. స్వాతంత్య్ర సమరం ఊపందుకుంది. విప్లవాల యుగం మొదలైంది. భారతీయుల్లో స్వాభిమానం వేయిసూర్యులై వెలిగింది. కొడిగట్టిపోతుందేమోననుకున్న ఆధ్యాత్మిక జ్యోతి అఖండంగా ప్రజ్వరిల్లింది.

కులభేదాల నిర్మూలన, ఆధ్యాత్మిక జాగరణ, యువతకు కర్తవ్యబోధ, హైందవ పునర్జాగృతి… ఇవే వివేకానందుని జీవన ధ్యేయాలయ్యాయి. దీనికోసమే ఆయన పనిచేశారు. తన శక్తులను ఒడ్డారు. దేశ యువత దరిద్ర నారాయణుడిని సేవాభావంతో అర్చించాలని చెప్పారు, చేయించారు.

ఆయన భౌతికదేహంతో మనమధ్య సంచరించింది కేవలం 38 సంవత్సరాలే. దీనిలో రామకృష్ణుడిని కలిసింది 18 ఏళ్ల లేజవ్వన ప్రాయంలో. సన్యాసం స్వీకరించింది పాతికేళ్ల వయస్సులో. ఆయన తన జీవితంలో సాధించినదంతా చివరి 13 సంవత్సరాలలోనే. ఈ 13ఏళ్ల జీవితమే ఆయనకు చిరంతనత్వాన్ని, చిరంజీవితత్వాన్ని, చిరయౌవనత్వాన్ని సాధించిపెట్టింది. సాధనచేస్తే, సాహసం ఉంటే, సమర్పణ భావంతో మెలిగితే… అల్పకాలంలోనే అనల్ప విజయాలను సాధించవచ్చునన్న సత్యాన్ని ఆయన నిరూపించారు. 1902 జూలై 4న వివేకానందుడు మహాసమాధిలోకి వెళ్లిపోయారు. అంతిమ ఘడియల్లో ఆయన పలికిన అంతిమ వాక్కుల్లోనూ అనంత ఆశావాదం, అద్భుత ఆత్మవిశ్వాసం పాలసముద్రమై పరవళ్లు తొక్కింది.

వివేకానందుడి ఆఖరి మాటలు ఇవి :
‘కాలక్రమంలో అనేకమంది వివేకానందులు ఉద్భవిస్తారు’.
వివేకానందుడు చెప్పిన ఆ వివేకానందులం మనమే ఎందుకు కాకూడదు?

-సూర్యపుత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *