జ్యోతిషం

మానవ జీవితం భూమండలంపై ఉండే వివిధ పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఈ పరిస్థితులు అనుకూలిస్తే జీవితం సుఖమయంగానూ, ప్రతికూలిస్తే దుఃఖమయంగానూ భావిస్తాం. ఈ పరిస్థితులు పూర్తిగా మన చేతుల్లోనే ఉండవు. ఈ విశ్వాన్ని శాసించే గ్రహాలు, నక్షత్రాల చేతుల్లో ఉంటాయి. అందుకే జాతక చక్రాలు భూమిపై ఆయా గ్రహాల ప్రసరణ వంటి వివరాల ఆధారంగా భవిష్యత్‌ను అంచనా వేస్తారు. ఆయా గ్రహాల శుభదృష్టి ఉంటే శుభసూచకం అని, ప్రతికూల దృష్టి ఉంటే అశుభం అని భావిస్తారు. ప్రతికూల దృష్టిగల సందర్భాలలో ఆయా గ్రహాల ప్రీతికోసం జపాలు, తర్పణాలు, హోమాలు చేయడంతో పాటుగా గ్రహ సంబంధిత క్షేత్రాలను దర్శించడం పరిపాటి.

జన్మ నక్షత్రాన్ని గుర్తించిన వెంటనే ఆచరించాల్సిన ఆధ్మాత్మిక క్రియలను నిర్వర్తిస్తారు. దోషం, గండం వంటి వాటిని అంచనా వేయడంతోపాటు చేపట్టాల్సిన పూజాధికాల్ని జోస్యులు సూచిస్తారు. నక్షత్రబలాన్నిబట్టి నామకరణంకూడా చేయడం ఆనవాయితీ. ఈ విషయాలకంటే ప్రదానమైన విషయం మరొకటి ఉంటుంది. పుట్టిన నక్షత్రం, రాశి ఆధారంగా స్వభావం, సహజ లక్షణాలు, పరిస్థితుల్ని అంచనా వేసుకోవడం, వాటినిబట్టి చేసే గణనలు, అంచనాలు కచ్చితంగా ఉండడమ గాకుండా రెమెడీస్‌కూడా సూటిగా ఉంటాయి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం మొత్తం మండలాన్ని 12 రాశులుగా విభజించారు. వీటికి 27 నక్షత్రాలను పాదాలవారీగా వర్గీకరించారు. ఆ ప్రకారం ప్రతి నక్షత్రంలోనూ నాలుగు పాదాల్ని గుణించడంద్వారా 27గ4=108 పాదాలు అవుతాయి. వీటిని తొమ్మిది చొప్పున సమంగా సర్దినట్టయితే ప్రతి రాశిలోనూ 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. దీని ఆధారంగా పుట్టిన సమయంలో ఉన్న నక్షత్ర సమయాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగాన్ని మొదటి పాదంగా, రెండో భాగాన్ని రెండో పాదంగా మొత్తం నాలుగు భాగాలను నాలుగు పాదాలుగా విభజిస్తారు. ఇది ఆయా శిశువుల జనన సమయాన్ని బట్టి వారి నక్షత్ర పాదం, సంబంధిత రాశి తెలుసుకోగలుగుతారు.

రాశి, నక్షత్రం, నక్షత్ర పాదం తెలుసుకొన్నట్లయితే జాతకుడి స్థితిగతులు గ్రహించవచ్చు. అలాగే జాతకుడు తన నక్షత్రాన్ని బట్టి ఆయా నక్షత్ర క్షేత్రాలను దర్శించుకొన వీలుంది. ఈ క్షేత్రాల వివరాలను ప్రాచీన శైవాగమ గ్రంథాలలో పొందుపరిచారు. ఆయా క్షేత్రాలలోని పరమేశ్వరుడిని భక్తితో అర్చిస్తే సంబంధిత నక్షత్రం ఆశీసులు పొందవచ్చును. ఈ క్షేత్రాలన్నీ పావన గోదావరి తీరంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం, కోటిపల్లి, రాయవరం మండలాల్లో ఉన్నాయి. వీటిని తమ తమ నక్షత్రానుసారంగా సందర్శించాలి. రోజులలో సోమవారం, తిథులలో ఏకాదశి, నక్షత్రాలలో ఆర్ద్ర మంచివిగా చెబుతారు. ఆయా రోజులలో, తిథులలో పరమేశ్వరుడిని అర్చించడంవల్ల శుభ ఫలితాలు సిద్ధిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *