అన్‌ సీజన్‌లో శబరి యాత్ర

రాష్ట్రంలో అయ్యప్ప దీక్షధారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దసరా పండుగ దాటగానే నల్లబట్టలు ధరించి, చందన కుంకుమ బొట్టు పెట్టుకుని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే భక్తకోటి దర్శనమిస్తోంది. స్వామియే శరణం అయ్యప్ప అని ఘోషిస్తూ ఏటా లక్షల సంఖ్యలో శబరిమలై సందర్శిస్తున్నారు. కార్తీక మాసం ప్రవేశించగానే తెలుగునాట ప్రతి పట్టణం, పల్లెల్లో అయ్యప్ప మాలధారులు కనిపిస్తారు. వీరంతా పుష్య మాసం (డిసెంబర్‌, జనవరి)లో శబరి మలై వెళ్లి స్వామిని దర్శిస్తారు. కానీ, అయ్యప్ప దర్శనం సీజన్‌తో కూడినది కాదు. ఏడాదిలో చాలా సందర్భాల్లో స్వామిని దర్శించుకునే వీలుంది. సీజన్‌లో వెళ్లేవారికి గురుస్వాముల మార్గదర్శకత్వం లభిస్తుంది. అన్‌ సీజన్‌లో కేవలం శబరి మలై యాత్ర చేసి, అయ్యప్పస్వామిని తనివితీరా దర్శించుకోవాలనుకునేవారికి సమాచారం కొరతగా ఉంటోంది. ఆ లోటును  తీర్చడమే ఈ వ్యాసం ఉద్దేశం. 

రాష్ట్రంలో అయ్యప్ప దీక్షధారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దసరా పండుగ దాటగానే నల్లబట్టలు ధరించి, చందన కుంకుమ బొట్టు పెట్టుకుని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడే భక్తకోటి దర్శనమిస్తోంది. స్వామియే శరణం అయ్యప్ప అని ఘోషిస్తూ ఏటా లక్షల సంఖ్యలో శబరిమలై సందర్శిస్తున్నారు. కార్తీక మాసం ప్రవేశించగానే తెలుగునాట ప్రతి పట్టణం, పల్లెల్లో అయ్యప్ప మాలధారులు కనిపిస్తారు. వీరంతా పుష్య మాసం (డిసెంబర్‌, జనవరి)లో శబరి మలై వెళ్లి స్వామిని దర్శిస్తారు. కానీ, అయ్యప్ప దర్శనం సీజన్‌తో కూడినది కాదు. ఏడాదిలో చాలా సందర్భాల్లో స్వామిని దర్శించుకునే వీలుంది. సీజన్‌లో వెళ్లేవారికి గురుస్వాముల మార్గదర్శకత్వం లభిస్తుంది. అన్‌ సీజన్‌లో కేవలం శబరి మలై యాత్ర చేసి, అయ్యప్పస్వామిని తనివితీరా దర్శించుకోవాలనుకునేవారికి సమాచారం కొరతగా ఉంటోంది. ఆ లోటును  తీర్చడమే ఈ వ్యాసం ఉద్దేశం.

శబరి మలై అనేది పశ్చిమ కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవులలో ఇమిడి ఉన్న ఎత్తయిన కొండ. కేంద్ర ప్రభుత్వం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించిన అటవీ ప్రాంతం. ఇక్కడకు వెళ్లాలంటే ఒకప్పుడు చాలా కష్టతరంగా ఉండేది. చెన్నయ్‌ లేదా బెంగళూరు వెళ్లి అక్కడనుంచి రైలులో ఎర్నాకుళందాకా వెళ్లి అక్కడ నుంచి బస్సుల్లో లేదా ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వచ్చేది. వాయుమార్గంలో వెళ్లాలంటే రెండు విమానాలు మారాల్చి వచ్చేది. చాలామంది భక్తులు అప్పట్లో ప్రైవేటు టూరిస్టు వాహనాలు  కుదుర్చుకుని యాత్ర చేసేవారు. ఏళ్లు గడిచేకొద్దీ రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. ముఖ్యంగా గడచిన నాలుగైదు సంవత్సరాలుగా ప్రయాణ సదుపాయాలు బాగా మెరుగయ్యాయి. వివిధ మార్గాలలో శబరి మలై వెళ్లేందుకు అనువు ఏర్పడింది.

శబరి మల కొలువైన కేరళలో రెండు -తిరువనంతపురం లేక త్రివేండ్రం, కొచ్చి లేక కొచ్చిన్‌- ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోని హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజూ అక్కడకు విమానాలు నడుస్తున్నాయి. అక్కడ నుంచి ట్యాక్సీలు మాట్లాడుకుని శబరికి వెళ్లి దర్శనం చేసుకుని రావచ్చును. 

అనువైన సాధనం రైలు
ఇక, రైలు మార్గంలో వెళ్లదలిస్తే.. శబరి మలైకు దగ్గరగా కొట్టాయం, చెంగనూరు అనే రెండు పట్టణాలున్నాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలనుంచి ఈ రెండు చోట్లకు నేరుగా రైలు సౌకర్యం ఉంది. హైదరాబాద్‌, నల్లగొండ, గుంటూరు ప్రాంతవాసులు శబరి ఎక్స్‌ప్రెస్‌ద్వారా; విశాఖ, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాలవారు బొకారో ఎక్స్‌ప్రెస్‌లోనూ వెళ్తుంటారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌, కొల్లం ఎక్స్‌ప్రెస్‌, కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ వంటి డైలీ సర్వీసులతోపాటు కొన్ని వీక్లీ, బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుకూడా ఉన్నాయి. వీటిద్వారానైనా ఎర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు స్టేషన్లవరకూ వెళ్లవచ్చు. ఈ రైళ్లలో టికెట్‌ దొరక్కపోతే చెన్నయ్‌ లేదా బెంగళూరు వెళ్లిపోతే అక్కడ నుంచి అనేక రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మండలం, మకర జ్యోతి సీజన్‌లో ప్రత్యేక రైళ్లుకూడా నడుస్తుంటాయి. చెన్నయ్‌ నుంచి, బెంగళూరు నుంచి నేరుగా కొచ్చిన్‌ (ఎర్నాకుళం అనికూడా పిలుస్తారు)కు ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు నగరాలనుంచి నేరుగా కొచ్చిన్‌కు కొన్ని ప్రైవేటు సర్వీసులవారు డైలీ ట్రిప్‌లు నడుపుతున్నారు.

పంబకు నిరంతరాయంగా బస్సులు
శబరి మలై బయలుదేరిన భక్తుల మనస్సంతా అయ్యప్ప స్వామి మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు శబరి గిరికి వెళ్దామా, అయ్యప్పను దర్శించుకుందామా అని మనస్సు ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. ఎన్నిసార్లు శబరికి వెళ్లి వచ్చినా తనివితీరదు. స్వామి పదే పదే ఆహ్వానిస్తుంటారని ప్రతీతి. అలాగే వెళ్లిన ప్రతిసారీ నూతన దివ్యానుభూతిని పొందవచ్చు. అందుకే రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్‌లలో దిగిన భక్తులు నేరుగా స్వామి సన్నిధికి వెళ్లిపోవాలన్న ఆత్రుతను కనబరుస్తారు. ఇప్పుడు కొచ్చిన్‌ (ఎర్నాకుళం), కొట్టాయం, శబరికి అతి సమీపంలో ఉండే చెంగనూరుల నుంచి నేరుగా ఎరుమేళికి, పంబకు ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా అందుబాటులో ఉంటున్నాయి. 

ఎరుమేళి నుంచి ‘పెద్దపాదం’ నడక
ఎరుమేళి అంటే శబరి మలై యాత్రకు తొలిమెట్టు. అటవీ మార్గంలో 50 కి.మీ.లు నడిచి వెళ్లాలనుకునేవారు ఇక్కడనుంచే అడవిలో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ సుదీర్ఘయాత్రను ‘పెద్ద పాదం’ అని వ్యవహరిస్తారు. ఎరుమేళిలో ఒక మసీదు ఉంటుంది. ఇక్కడ ఉండే వావర్‌స్వామిని దర్శించడం, అక్కడ అటవీ సాంప్రదాయంలో పేటతుళ్లి అనే సంప్రదాయ నృత్యం చేయడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడ ధర్మశాస్త్ర గుడిని దర్శించవచ్చు. ఎరుమేళి అనేది ఇరుకైన రోడ్ల నడుమ ఇమిడిన చిన్న పల్లెటూరు. సీజన్‌లో మాత్రమే భక్తుల సందడి కనిపిస్తుంది. చుట్టూ ఎత్తయిన కొండల మధ్య పచ్చని ప్రకృతిలో ఒదిగిపోయిన చిరు గ్రామం ఇది. ఇక్కడ రూమ్‌లు లభిస్తాయి. ప్రణాళికాబద్దంగా యాత్రను రూపొందించుకుంటే ఎరుమేళిలో బసచేసి చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించవచ్చు.

విధిగా వావర్‌ స్వామి దర్శనం
ఎరుమేళిలో వావర్‌ స్వామిని దర్శించుకున్న అనంతరం కొందరు ‘పెద్ద పాదం’ యాత్ర చేయాలనుకుంటారు. అలాకానివారు పంబకు వెళ్తారు. ఎరుమేళి నుంచి పంబకు 55 కి.మీ. దూరం దట్టమైన అటవీ ప్రాంతంగుండా రోడ్డు ప్రయాణం సాగుతుంది. రెగ్యులర్‌ బస్సు సర్వీసులు ఉన్నందున ఇటీవల చాలామంది ఎరుమేళి వెళ్లకుండా నేరుగా రైల్వే స్టేషన్‌, బస్‌ స్టాండ్లనుంచే పంబకు వెళ్లిపోతున్నారు. ఎర్నాకుళం నుంచి 175 కి.మీ.లు, కొట్టాయం 125, చెంగనూరు 90, త్రివేండ్రం 175కి.మీ.ల దూరంలో పంబ ఉంటుంది. ఈ నాలుగు చోట్ల నుంచి సీజన్‌లో నిరంతరాయంగా బస్సులు తిరుగుతాయి. అన్‌ సీజన్‌లోమాత్రం క్రమంగా బస్సు సర్వీసులుంటాయి. 

పంబ వరకూ స్త్రీలకు అనుమతి
పంబ వరకూ స్వాములనే కాక స్త్రీలనుకూడా అనుమతిస్తారు. పంబ వద్ద 10 నుంచి 50ఏళ్ల లోపు మహిళలను నిలుపుచేస్తారు. ఇక్కడ మహిళలకోసం ప్రత్యేక విశ్రాంతి గదులు ఉన్నాయి. కీలక యాత్రా సీజన్‌లో కేరళ పోలీసు శాఖవారి మహిళా గార్డులు భద్రత కల్పిస్తారు. శబరి మల మొత్తం అయ్యప్పస్వామి తిరుగాడిన పవిత్ర ప్రదేశమే. అందువల్ల మహిళలు పంబా నదీతీరాన్ని స్వామి పాదముద్రగా భావించి భక్తిభావం చాటుకుంటారు.

 పంబ వద్ద కన్నె మూలగణపతి గుడి ఉంది. ఇక్కడితో అన్ని వాహనాలు నిలిచిపోతాయి. పంబ నుంచి స్వామి సన్నిధానానికి సుమారు 5 కి.మీ.లు ఉంటుంది. ఈ దూరాన్ని ఎంతటివారైనాగానీ కాలినడకన అధిగమించాల్సిందే. వృద్ధులకోసం, అశక్తులకోసం డోలీ (పల్లకీ) సదుపాయం ఉంటుంది. దేవస్థానంవారే ధర నిర్ణయిస్తారు. అయితే, సీజన్‌లోనూ, డిమాండ్‌నుబట్టి డోలీ మోసేవారు ప్రత్యేకంగా డిమాండ్‌ చేస్తుంటారు. 

సన్నిధానంలో విశ్రాంతికి సదుపాయం
దాదాపు 4 గంటలపాటు శరణుఘోష చేసుకుంటూ శబరి కొండను ఎక్కిన అనంతరం అయ్యప్ప సన్నిధానాన్ని చేరుకుంటారు. పైనకూడా కొన్ని విశ్రాంతి గదులు ఉంటాయిగానీ సీజన్‌లో మినహా ఇతరత్రా ఎవ్వరూ పట్టించుకోరు. సీజన్‌లోనైనా డోనర్లకు, డోనర్‌ పాస్‌లు ఉన్నవారికే ముందుగా అవకాశం లభిస్తుంది. అన్‌సీజన్‌లో సన్నిధానం సమీపాన వసతి సులభంగానే దొరుకుతుంది. అయితే లక్షలాది భక్తులు సన్నిధికి వచ్చినా రూమ్‌లు పెద్దగా తీసుకోరు. దర్శనం చేసుకుని వెనక్కి మళ్లుతారు. 

అయ్యప్ప భక్తులకు దారిపొడవునా వైద్య సహాయం అందుబాటులో ఉంటుంది. ఒకప్పుడు నడక దారిలో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు మందులు దొరుకుతున్నాయి. ఇక, అయ్యప్ప దర్శనానికి వెళ్లే స్వాములకోసం శుచీశుభ్రతలతోకూడిన ఆహారం అన్ని వేళల్లోనూ, అన్నిచోట్ల అతి తాజాగా లభ్యమవుతోంది. అడుగడుగునా సమాచారం అందించడానికి అఖిల భారత అయ్యప్ప సేవాసమాజంవారు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేశారు. పంబకు చేరుకోగానే కుల, మత, ప్రాంత భేదాలుగానీ, ధనిక బీద తారతమ్యంగానీ కనిపించవు. అందరూ అయ్యప్పలే అన్న స్ఫూర్తి గోచరిస్తుంది. 

ఆన్‌లైన్‌ద్వారా దర్శనానికి అవకాశం
సుమారు పాతికేళ్ల క్రితం మేము అయ్యప్ప కొండకు వెళ్లినప్పుడు మాకు అక్కడక్కడ ట్యూబ్‌ లైట్లు మాత్రమే కనిపించేవి. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండేవి. వైద్యంగానీ, తగిన ఆహారంగానీ లభించేది కాదు. మంచినీళ్లుకూడా వెంట తీసుకువెళ్లేవాళ్లం. గురుస్వామిని విడవకుండా ముందుకు కదిలేవాళ్లం. ఇప్పుడు చాలా మార్పులొచ్చాయి. శబరినాథుడిపై భక్తి విశ్వాసాలు నలుదెసలా వ్యాపించాయి. భక్తుల రద్దీ పెరుగుతున్నకొద్దీ సదుపాయాలుకూడా చోటుచేసుకున్నాయి. అలాగే కొత్త ఇబ్బందులుకూడా ఏర్పడుతున్నాయి. మండలం, జ్యోతి దర్శనం వంటి కీలక యాత్రా సమయాల్లో శబరి కొండ కిటకిటలాడుతుంది. ముఖ్యంగా జనవరి నెలలో భక్తులు లెక్కకు మిక్కిలిగా వస్తుంటారు. దీంతో వాహనాల పార్కింగ్‌కు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. పంబ నుంచి దూర ప్రాంతానికి మార్చేస్తారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దర్శనం స్లాట్‌ బుక్‌ చేసుకునే సౌకర్యం లభిస్తోంది. దీనివలన నేరుగా అయ్యప్ప సన్నిధికి వెళ్లే అవకాశం కలుగుతోంది. 

మాలధారులు, సివిల్‌ స్వాములు!
శబరి మలపై స్వామి దర్శనానికి రెండు విధాలైన మార్గాలుంటాయి. ఒక మార్గంద్వారా మాలధారులై ఇరుముడితో వచ్చిన స్వాములు, రెండోమార్గంద్వారా స్వాములు, సాధారణ భక్తులు (వీరినే సివిల్‌ స్వాములుగా వ్యవహరిస్తారు) దర్శనం చేసుకోవాలి. ఇరుముడి ధరించిన స్వాములు ‘పదునెట్టాంపడి’ అనే పవిత్ర 18 మెట్లమీదుగా గర్భాలయం ముంగిటకు చేరుకుంటారు. సివిల్‌ స్వాములు పక్కనే ఉన్న రెండో మార్గంద్వారా గుడిలో ప్రవేశించి స్వామిని దర్శిస్తారు. అయ్యప్పకు ఇరుముడిని చూపించి నెయ్యి అభిషేకం టిక్కెట్లు తీసుకుని ఇరుముడిని సమర్పిస్తారు. ఆ తర్వాత వీలైననిసార్లు అయ్యప్పను దర్శించుకోవాలని భక్తులు తహతహలాడతారు. అయ్యప్ప దర్శనంతో భక్తులు అప్పటిదాకా పడిన కష్టాలను మరచిపోతారు. శరీరమంతా పులకించిపోయే సందర్భం అది.

-రమా విశ్వనాథన్‌, ఎం.ఏ (జ్యోతిషం), 
అనువంశిక అర్చకులు, శ్రీభద్రకాళి వీరేశ్వరస్వామి దేవస్థానం,
మాచవరం (తూ.గో.జిల్లా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *