కొత్తగట్టుపై మత్స్యగిరీంద్రుడు


తెలుగు నేల అడుగడుగునా దేవుని జాడలున్నాయి. శ్రీమహావిష్ణువు అవతార మూర్తులు ఇక్కడ కొలువుదీరాయి. అరుదైన మత్స్య, వరాహ, కూర్మ, నరసింహ, వామన దేవాలయాలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తెలుగునాట పూజలందుకుంటున్నాయి.  శ్రీమహావిష్ణువు తొలి అవతారమైన మత్స్య దేవుడి ఆలయాన్ని పరిచయం చేస్తున్నాం.

తెలుగు నేలను పాలించిన రాజులలో కాకతీయులది అద్వితీయ స్ధానం. ఆర్థిక, సామాజిక, రాజకీయ కోణాల్లోనే కాకుండా ఆథ్మాత్మికపరంగానూ వారు ఎనలేని సేవలు చేశారు. వారి కాలంలోనే వేయిస్తంభాల మంటపం, రామప్ప దేవాలయం, భద్రకాళి అమ్మవారి ఆలయం వంటివి రూపుదాల్చాయి. ఆ కోవలోనే శ్రీమహావిష్ణువు ఆది అవతారమైన మత్స్యమూర్తికి కొత్తగట్టులో కోవెల వెలసింది. మత్స్యమూర్తికి మొత్తం భారతదేశంలోనే రెండుచోట్ల ఆలయాలు ఉండగా, ఇదే మొదటిదిగా చెబుతారు. రెండోదికూడా మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో నాటి విజయనగర రాజుల పాలనలో నిర్మితమైంది. 

కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరాన కొత్తగట్టుపై మత్స్యగిరీంద్రుడు కొలువుదీరాడు. క్రీ.శ.13వ శతాబ్దంలో కాకతీయుల పాలనా కాలంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారుల అంచనా. ప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు లోకోపకారం కోసం మత్స్యరూపుడైనాడు. ఋషులు, సత్పురుషులు, వనమూలికలు, దివ్యౌషధులు, పశుపక్ష్యాదులతో కూడిన నావను తన కొమ్ముకు కట్టుకుని ప్రళయ జలధిని దాటించసాగాడు. అదే తరుణంలో సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించి సముద్రంలో దాక్కున్నాడు. బ్రహ్మ వేడుకోవడంతో మత్స్యరూపుడైన విష్ణుమూర్తి వేద సంరక్షణ గావించాడు. దుష్ట సంహారం చేసి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడు.

శ్రీమహావిష్ణువు అవతారాలలో మొట్టమొదటిదైన మత్స్యఅవతార అంశమే కొత్తగట్టు దేవాలయంలో కొలువై ఉంది. ఈ ఆలయ సమీపానే నిండైన కోనేరుకూడా ఉంది. స్వామివారి గుట్టపైనున్న ఈ కోనేరు సర్వకాలాల్లోనూ నీరు నిండుగా ఉండడం ఒక విశేషంగా భక్తులు భావిస్తారు. ఈ కోనేరులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే తమ పాపాలు హరించి, కోరిన కోర్కెలు ఈడేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

పంటకు పెన్నిధి
అంతేగాక, ఈ ప్రాంతంలోని రైతాంగానికికూడా ఈ కోనేరులోని నీటిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తమ తమ పంటపొలాల్లో చల్లితే చీడపీడలేవీ దరి చేరకుండా దిగుబడి సమృద్ధిగా ఉంటుందని విశ్వసిస్తారు. ప్రతి ఏడాది మాఘ మాసంలో మత్స్యగిరీంద్రుడికి దశాహం నిర్వహిస్తారు. మాఘ శుద్ధ పౌర్ణమితో ఈ ఉత్సవాలు ఆరంభమై పదిరోజులపాటు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీమత్స్యగిరీంద్రుడికి భూదేవి, నీలాదేవిలతో కల్యాణం జరిపిస్తారు. కల్యాణం మరుసటి రోజునుంచి జాతర పెద్దఎత్తున జరుగుతుంది. ఆ పది రోజులూ కరీంనగర్‌ జిల్లావాసులే కాకుండా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలవారు జాతరలో పాల్గొని మత్స్యగిరీంద్రుడి ఆశీసులు అందుకుంటారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *