సత్యం సాక్షాత్ పరబ్రహ్మ

నా అభిప్రాయం ప్రకారం ‘సత్యమే అన్నింటిలోను గొప్పది. అందు పలు విషయాలు నిహితమై ఉంటాయి. ఈ సత్యం స్థూలంగా ఉండే వాక్సత్యం కాదు. ఇది వాక్కుకు సంబంధించినదేగాక భావానికి సంబంధించిన సత్యం కూడా. ఇది కల్పిత సత్యంగాక సుస్థిరత కలిగిన స్వతంత్రమైన అస్థిత్వంగల సత్యం. అంటే సాక్షాత్ పరబ్రహ్మ అన్న మాట. పరమేశ్వరునికి వ్యాఖ్యలు అనేకం. గొప్పతనాలు అనేకం. ఆ గొప్పతనాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. కొద్దిసేపు నన్ను మోహింపజేస్తాయి. నేను సత్యస్వరూపుడగు పరమేశ్వరుని పూజారిని. అతడొక్కడే సత్యం. మిగిలినదంతా మిధ్యయే. ఆ సత్యం నాకు గోచరించలేదు. 
ఆ సత్య సాక్షాత్కారం కలుగనంతవరకు నా అంతరాత్మ దేన్ని సత్యమని నమ్ముతుందో ఆ కాల్పనిక సత్యాన్ని ఆధారం చేసుకుని, దానినే దీపంగా భావించి దాని ఆశ్రయంలో జీవితం గడుపుతాను. నిజానికి ఇది కత్తిమీద సాము వంటిది. ఈ మార్గాన నడుస్తున్నపుడు భయంకరమైన పొరబాట్లుకూడా తుచ్ఛమైనవిగా కనబడతాయి. అట్టి పొరబాట్లుచేసికూడా రక్షణ పొందాను. విశుద్ధ సత్యపు వెలుగు రేఖ దూరాన లీలగా కనబడుతూ ఉంది. ఈ జగత్తులో సత్యందప్ప మరొకటి లేదను నమ్మకం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది. 
సత్య శోధనకు సంబంధించిన సాధనాలు ఎంత కఠినమైనవో అంత సరళమైనవికూడా. అవి అహంకారికి అశక్యాలు. కల్లాకపటం ఎరుగని బాలునికి శక్యాలు. సత్యాన్వేషకుడు ధూళికణంకంటే చిన్నగా ఉండాలి. ప్రపంచమంతా ధూళికణాన్ని కాలికింద తొక్కి వేస్తుంది. అందుకే సత్యాన్వేషకుడు ధూళికణంకూడా తొక్కివేయలేనంత సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే అతనికి సత్యం లీలగా గోచరిస్తుంది. ఈ విషయం వశిష్ట-విశ్వామిత్రుల కథలో స్పష్టంగా చెప్పబడింది. ఇస్లాం, క్రైస్తవ మతాలుకూడా ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. 

(గాంధీజీ ఆత్మకథ ‘సత్య శొధన నుంచి…)    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *